samosa: బర్గర్ కన్నా సమోసా మేలు... అధ్యయనంలో వెల్లడి
- ఫ్రెష్ తినుబండారాల్లో తక్కువ రసాయనాలు
- రసాయనాలు ఉన్న పదార్థాల వల్ల స్థూలకాయత్వం
- వెల్లడించిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్
జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం పాలవుతారనే సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ సాయంత్రం అయిందంటే చాలు నోటికి తాళం వేయలేక ఏ బర్గరో, పిజ్జానో తినేస్తారు. అయితే బర్గర్, పిజ్జాల కంటే సమోసా లాంటి ఫ్రెష్ తినుబండారాలను తింటే మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వహించిన అధ్యయనంలో బర్గర్‌లో కంటే రసాయనాలు తక్కువగా ఉండే సమోసాలు తినడం మంచిదని వెల్లడైంది.
సమోసాలో ఉండే ఆలూ, పిండి ఇతర పదార్థాలు సహజంగా లభించేవని, బర్గర్‌లో అయితే సాస్‌లు, చీజ్‌లు, ఇతర ప్రిజర్వేటివ్స్ కారణంగా స్థూలకాయత్వం బారిన పడే అవకాశాలు ఎక్కువని తేల్చింది. 'బాడీ బార్డర్: లైఫ్‌స్టైల్ డిసీసెస్' పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో స్థూలకాయత్వం, మానసిక ఎదుగుదల, కేన్సర్, హృద్రోగాల వంటి రోగాలకు ఆహారపు అలవాట్లకు మధ్య సంబంధాన్ని వివరించారు.