parvez musharraf: కరుడుగట్టిన ఉగ్రవాది హపీజ్ సయీద్ పై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
- హఫీజ్ సయీద్ అంటే నాకు చాలా ఇష్టం
- కశ్మీర్ వేర్పాటువాదులకు ఎంతో సహకారం అందిస్తున్నాడు
- సయీద్ తో చాలా సార్లు భేటీ అయ్యా
పాకిస్థాన్ మాజీ సైనిక నియంత ముషారఫ్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. కరుడుగట్టిన ఉగ్రవాది, జామాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తాయిబా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన హఫీద్ సయీజ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ వేర్పాటువాదులకు సయీద్ ఎంతో సహకారం అందిస్తున్నాడని... ఆ ప్రాంతంలో ఉగ్రదాడులకు, జిహాద్ కు ఊతం అందిస్తున్న సయీద్ అంటే తనకు ఎంతో మమకారం అని చెప్పారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న జమాత్ ఉద్ దవా, లష్కరే తాయిబాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని తెలిపారు. తాను అధికారంలో ఉన్న సమయంలో సయీద్ తో పలుమార్లు భేటీ అయ్యానని చెప్పారు.
జమ్ముకశ్మీర్ పై సైనిక చర్యకు తాను ఎప్పుడూ అనుకూలంగానే ఉంటానని ముషారఫ్ అన్నారు. అయితే, భారత సైన్యం చాలా శక్తిమంతమైనదని చెప్పారు. అమెరికా సహకారంతో లష్కరే తాయిబాను ఉగ్ర సంస్థగా ప్రకటించడంలో భారత్ సఫలమైందని అన్నారు. కశ్మీర్ లో లష్కరే తాయిబా సమర్థవంతంగా పని చేస్తోందని చెప్పారు.