Giddi Eshwari: కోట్లున్న వారికే సీట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు!: గిడ్డి ఈశ్వరి ఆరోపణ

  • కోట్లున్న వారికే జగన్ సీట్లు ఇస్తానన్నారు
  • డబ్బు పాముకు జగన్ బలైపోవడం ఖాయం
  • టీడీపీలో చేరిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చింది
  • జగన్ గెంటేస్తే.. చంద్రబాబు ఆదరించారు

రెండు రోజుల క్రితం టీడీపీ తీర్థం పుచ్చుకున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది డబ్బు సంస్కృతని, డబ్బులతో రాజకీయం చేయవచ్చనేది జగన్ ఆలోచన అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లున్న వారికే సీట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారని, కోట్లకు సీట్లు అమ్ముకునే సంస్కృతి చివరికి ఆయనను విషనాగై కాటేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కోట్లు ఉన్న వారికే సీట్లు ఇస్తామన్న జగన్ తీరు తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీలో ఉండగా సీఎం, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలతో ఎవరితోనూ మాట్లాడకూడదనే ఆంక్షలు ఉండేవన్నారు. జగన్ చెప్పినట్టే చేయాల్సి వచ్చేదని అన్నారు. జగన్ వల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయామని, ఇప్పుడు వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

జగన్ తనను గెంటేస్తే, చంద్రబాబు తనను ఆదరించారని అన్నారు. గిరిజనుల మనోభావాలకు విలువనిచ్చిన చంద్రబాబు మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాడేరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Giddi Eshwari
Telugudesam
YSRCP
Jana Reddy
Chandrababu
  • Loading...

More Telugu News