China: చైనా మొబైల్స్, యాప్స్ నుంచి భారత భద్రతకు తీవ్రముప్పు?
- 40 యాప్స్ ప్రమాదకరమన్న నిఘా అధికారి
- వీటిలో రోజువారీ వినియోగంలో ఉన్న యాప్స్
- భారత్ లో విపరీతంగా అమ్ముడయ్యే చైనా మొబైల్స్
చైనా మొబైల్స్, యాప్స్ తో భారత భద్రతకు తీవ్రముప్పు పొంచి ఉందని పారామిలటరీ దళాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ డీఐజీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. భారత్ లో చైనా మొబైల్స్ విపరీతంగా అమ్ముడవుతూ రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ మొబైల్స్ లో చైనాకు చెందిన యాప్స్ ను విరివిగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా మొబైల్స్, యాప్స్ ద్వారా కీలక సమాచారం ఆ దేశానికి చేరే ప్రమాదం ఉందని ఆయన కేంద్ర, రాష్ట్ర పారామిలటరీ దళాలను హెచ్చరించినట్టు తెలుస్తోంది.
సుమారు 40 యాప్స్ తో ఈ ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ 40 యాప్స్ వాడినవారి వ్యక్తిగత వివరాలు చైనా అధికారులకు చేరే అవకాశం ఉందని ఆ హెచ్చరికల్లో ఉన్నట్టు సమాచారం. ఈ యాప్స్ లో ప్రతిఒక్కరూ సాధారణంగా వినియోగించే యాప్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ యాప్స్ ను సైనికాధికారులు, పారామిలటరీ దళాల సిబ్బంది వినియోగించడం వల్ల అత్యంత కీలక సమాచారం చైనాకు తెలిసిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే దేశభద్రతకు విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.