LIC: బీ కేర్‌ఫుల్.. ఆ ఎస్సెమ్మెస్‌లు నమ్మొద్దు.. హెచ్చరించిన ఎల్ఐసీ

  • పాలసీలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ చేపట్టలేదన్న ఎల్ఐసీ
  • ఆధార్ నంబరు కోరుతూ వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని సూచన
  • తాము చేపట్టే ముందు సమాచారం ఇస్తామని స్పష్టీకరణ

గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చరించింది. బీమా పథకాలతో ఆధార్‌ను అనుసంధానించే ఎటువంటి ప్రక్రియను తాము చేపట్టలేదని, కాబట్టి ఆధార్ అనుసంధానం కోరుతూ వచ్చే ఎస్సెమ్మెస్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నంబరకు మీ ఆధార్ నంబరును పంపడం ద్వారా పాలసీతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని కోరుతూ వినియోగదారులకు మెసేజ్‌లు వస్తున్నట్టు ఎల్ఐసీ అధికారులు తెలిపారు. ఎల్ఐసీ లోగోతో ఈ మెసేజ్‌లు పంపుతూ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తామైతే ఇప్పటి వరకు అనుసంధాన ప్రక్రియ చేపట్టలేదని, కాబట్టి వాటిని పొరపాటున కూడా నమ్మవద్దని సూచించారు. ఒకవేళ తామే కనుక ఆ ప్రక్రియ చేపడితే అందుకు సంబంధించిన వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని వివరించారు.

బీమా పాలసీదారులు తమ పాలసీని ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఇటీవల బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగి ఈ ఎస్సెమ్మెస్‌లను పంపిస్తున్నారు.

  • Loading...

More Telugu News