punjagutta: హైదరాబాద్ లో కిలోమీటరు దూరంలో 12 సినిమా హాల్స్... సిద్ధం చేసిన ఎల్ అండ్ టీ!
- పంజాగుట్ట, ఎర్రమంజిల్ మాల్స్ డిసెంబర్ లో ప్రారంభం
- కిలోమీటరు దూరంలోనే రెండు భారీ మాల్స్
- 45 శాతం ఆదాయం పొందడమే ఎల్ అండ్ టీ లక్ష్యం
కేవలం మెట్రో రైలుతో వచ్చే ఆదాయంతో రైలు మార్గం నిర్మాణం కోసం తాము వెచ్చించిన నిధులు వెనక్కు రావంటూ, ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ భారీ మాల్స్ నిర్మాణంను చేపట్టిన సంగతి తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభోత్సవం తరువాత మాత్రమే ఈ మాల్స్ ప్రారంభించుకోవచ్చన్న నిబంధన ఉండగా, నేడు ఆ ముహూర్తం నిశ్చయమైంది. రేపటి నుంచి మెట్రో సేవలు హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుండగా, సాధ్యమైనంత త్వరలోనే మాల్స్ ను ప్రారంభించే యోచనలో ఎల్ అండ్ టీ ఉంది.
ఇప్పటికే పంజాగుట్ట, ఎర్రమంజిల్ మధ్య కేవలం కిలోమీటరు దూరంలో రెండు మాల్స్ ను సంస్థ పూర్తి చేసింది. ఈ రెండు చోట్ల 12 వరకూ సినిమా హాల్స్ ఉంటాయి. పలు ప్రముఖ బ్రాండ్లు దుకాణాలు ఏర్పాటు చేసేందుకు డీల్స్ కుదుర్చుకున్నాయి. పంజాగుట్టలో గతంలో 'పడవ స్కూల్' ఉన్న ప్రాంతంలో ఎల్ అండ్ టీ నిర్మించిన మాల్ అత్యున్నత సాంకేతిక వసతులతో నిర్మితం కాగా, ఎర్రమంజిల్ మాల్ సైతం అదే స్థాయిలో తయారైంది. వీటితో పాటు హైటెక్ సిటీ మాల్, మూసారంబాగ్ లో నిర్మాణం కొలిక్కి వచ్చింది. తొలుత ఎర్రమంజిల్, పంజాగుట్ట మాల్స్ ను రాబోయే నెల రోజుల్లోనే ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. డిసెంబర్ చివరిలోగా ఇవి సేవలు ప్రారంభిస్తాయని సమాచారం.
ఇక ఈ మాల్స్ నుంచి ఎల్అండ్ టీ కి వచ్చే ఆదాయం 45 శాతం వరకూ కవర్ అవుతుందని అంచనా. పైగా వీటికి సమీపంలోని మెట్రో స్టేషన్లు అనుసంధానం అయి ఉండటంతో, వీటికి ప్రజాదరణ కూడా బాగానే ఉంటుందని సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రూ.2243 కోట్ల వ్యయంతో నిర్మాణం అవుతున్న మొత్తం నాలుగు మాల్స్ కలిపి 60 లక్షల చదరపు అడుగుల్లో ఉండగా, ఒక్క రాయదుర్గం వద్ద ఉండే హైటెక్ సిటీ మాల్ 15 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమవడం గమనార్హం. ఈ మాల్ మాత్రం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వరకూ మెట్రో రైల్ నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం.