Farooq Abdullah: మళ్లీ నోరు జారిన ఫరూక్ అబ్దుల్లా.. దమ్ముంటే శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగరవేయాలని సవాల్!
- తొలుత శ్రీనగర్‌లో జెండా ఎగరేసి చూడాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
- జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం కాబోదని వ్యాఖ్య
- ఫరూక్ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మరోమారు నోరు జారారు. కేంద్రానికి దమ్ముంటే శ్రీనగర్ నడిబొడ్డున లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగరవేయాలని సవాల్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన దానికి కొనసాగింపుగా ఇప్పుడీ వ్యాఖ్యలు చేశారు. ‘‘పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కాదు.. దమ్ముంటే శ్రీనగర్‌లో ఎగరేయండి చూద్దాం’’ అని కేంద్రానికి సవాల్ చేశారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగం కాబోదని పునరుద్ఘాటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తామని కొందరు (కేంద్రం, బీజేపీని ఉద్దేశించి) అంటున్నారని, అయితే అక్కడ ఎగరవేయడానికి ముందు శ్రీనగర్‌లో ఆ పనిచేసి ఆ తర్వాత పీవోకే గురించి మాట్లాడాలని అన్నారు. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం కాబోదని అన్నారు.
ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను ఆయన ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. లాల్ చౌక్ సహా రాష్ట్రమంతటా త్రివర్ణ పతాకం ఎగురుతున్న విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు.