new zealand: భూకంప ప్రళయం రానుంది.. న్యూజిలాండ్ కు శాస్త్రవేత్తల తీవ్ర హెచ్చరికలు!
- న్యూజిలాండ్ కు జియాలజిస్టుల హెచ్చరికలు
- 9.0 తీవ్రతతో భూకంపం వచ్చే ప్రమాదం
- తీవ్రమైన సునామీకి అవకాశం
న్యూజిలాండ్ కు పెను ప్రమాదం పొంచి ఉందని జియాలజిస్టులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్ కు చేరువలో ఉన్న హికురంగీ పీఠభూమిలో వస్తున్న కదలికలు ఆ దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని నిర్ధారిస్తున్నాయని వారు వెల్లడించారు. గతంలో జపాన్ ను పట్టికుదిపేసిన భూకంపం నాటి పరిస్థితులు న్యూజిలాండ్ లో కనిపించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. 9.0 తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని, దీని తీవ్రతతో భయంకరమైన సునామీ న్యూజిలాండ్ ను అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.
ఈ సునామీని తప్పించుకునేందుకు న్యూజిలాండ్ కు కేవలం ఏడు నిమిషాల సమయం మాత్రమే ఉంటుందని వారు వెల్లడించారు. 2011లో జపాన్ లో సంభవించిన భూకంపం రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఎక్కడంతో సంభవించిందని వారు గుర్తు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్ లో కూడా అలాంటి పరిస్థితే నెలకొందని, దీంతో మరోసారి ఆనాటి పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని వారు తెలిపారు. కాగా, 2004లో ఇండోనేసియా సమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ 2,50,000 మందిని బలిగొన్న విషయాన్ని జియాలజిస్టులు గుర్తుచేస్తున్నారు.