Cricket: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కు ఓటేసిన వీవీఎస్ లక్ష్మణ్!
- డివిలియర్స్, సర్ఫరాజ్, కోహ్లీలలో ఎవరు బెస్ట్ కెప్టెన్?
- హేడెన్ ఓటు కోహ్లీకి, అర్నాల్డ్ ఓటు సర్ఫరాజ్ కి
- లక్ష్మణ్ ఓటు కూడా సర్ఫరాజ్ కే
'దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ లలో ఎవరు బెస్టు?' అంటూ చెప్పమని క్రికెట్ విశ్లేషకులు మాథ్యూ హేడెన్, అర్నాల్డ్, వీవీఎస్ లక్ష్మణ్ లను ఒక టీవీ ఛానెల్ ప్యానల్ కోరింది. దీనికి హేడెన్ స్పందిస్తూ, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పేరు చెబుతానన్నాడు. ఆర్నాల్డ్ అయితే, తన దృష్టిలో సర్ఫరాజ్ అహ్మద్ విజయవంతమైన కెప్టెన్ అని అన్నాడు. దీంతో లక్ష్మణ్ ఎవరి పేరు చెబుతాడా? అని ఆసక్తితో ఎదురు చూడగా, ఎవరూ ఊహించని విధంగా సర్ఫరాజ్ కే లక్ష్మణ్ ఓటేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.
దానిపై లక్ష్మణ్ వివరణ ఇస్తూ, ఈ ఏడాది జరిగిన కీలకమైన వన్డే టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి, సర్ఫరాజ్ ట్రోఫీని జట్టుకు అందించాడని గుర్తు చేశాడు. ఆ విజయాన్ని మించిన విజయం మరొకటి ఉంటుందని తాను భావించడం లేదని అన్నాడు. మేజర్ టోర్నీలో మంచి ఫాంలో ఉన్న అత్యుత్తమ జట్టును ఓడించడం సాధారణ విషయం కాదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అతని వివరణతో అంతా ఏకీభవించారు. అంతే కాకుండా కోహ్లీ కంటే సర్ఫరాజ్ సక్సెస్ రేటు బాగుందని కూడా గుర్తు చేశాడు. అందుకే తాను కోహ్లీ కంటే సర్ఫరాజ్ వైపు మొగ్గుచూపానని లక్ష్మణ్ అన్నాడు.