flipkart: ఫ్లిప్‌కార్ట్ మోసం చేసిందంటూ వ్యాపారవేత్త ఫిర్యాదు.. కేసు నమోదు!
- సరుకులకు డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదు చేసిన వ్యాపారవేత్త
- సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌పై చీటింగ్ కేసు నమోదు
- రూ. 9.96 కోట్లు బాకీ పడిన ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు
'బిగ్ బిలియన్ సేల్' పేరుతో ఇటీవల వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులను అందజేసిన ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఈ అమ్మకంలో భాగంగా ఆ సంస్థ తనను మోసం చేసిందంటూ ఓ వ్యాపారవేత్త కేసు పెట్టాడు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని నవీన్ కుమార్ 2015 నుంచి 2016 వరకు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తన సంస్థ తరఫున 14,000 ల్యాప్‌టాప్‌లు, ఇతర కంప్యూటర్ పరికరాలు అమ్మాడు. అయితే వీటికి ఫ్లిప్‌కార్ట్ డబ్బులు చెల్లించలేదని నవీన్ ఫిర్యాదు చేశాడు.
దీంతో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లపై ఇందిరా నగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఫ్లిప్‌కార్ట్ సేల్స్ డైరెక్టర్, అకౌంట్ మేనేజర్లపైనా నవీన్ ఫిర్యాదు చేశాడు. ఫ్లిప్‌కార్ట్ రూ.9.96 కోట్లు చెల్లించకుండా తనను మోసం చేసినట్లు నవీన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పంపిన వస్తువుల్లో 1,482 వస్తువులను ఫ్లిప్‌కార్ట్ వెనక్కి ఇచ్చేసి మిగతా వస్తువులకు డబ్బు చెల్లించలేదని తెలిపాడు. వాటికి సంబంధించిన టీడీఎస్, షిప్పింగ్ ఛార్జీలు కూడా చెల్లించలేదని వాపోయాడు. వీటి గురించి అడిగితే అన్ని వస్తువులు వెనక్కి ఇచ్చేశామని .. ఇక ఎలాంటి బాకీలు లేవని బన్సల్ సోదరులు వాదించినట్లు నవీన్ ఆరోపించాడు. అయితే ఈ కేసుపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా స్పందించలేదు.