Cricket: నాగ్ పూర్ టెస్ట్ లో ఇండియా విజయం: భార‌త టెస్ట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసిన కోహ్లీ సేన‌!

  • శ్రీలంకపై ఇన్నింగ్స్, 239 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం
  • శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 205, రెండో ఇన్నింగ్స్ 166
  • భార‌త్ తొలి ఇన్నింగ్స్ 610/6 డిక్లేర్డ్
  • మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భార‌త్

నాగ్‌పూర్‌లో జ‌రిగిన రెండో టెస్టులో శ్రీలంక‌పై టీమిండియా భారీ విజయం సాధించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ 610/6 వ‌ద్ద‌ డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ 205కే ఆలౌటైన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లోనూ ఏ మాత్రం రాణించ‌లేక‌పోయింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక‌ 166 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌ ఇన్నింగ్స్, 239 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ శ‌త‌కాలు, కోహ్లీ ద్విశ‌త‌కం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. భార‌త టెస్ట్ చ‌రిత్ర‌లోనే కోహ్లీ సేన అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది.
 
21/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఈ రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక బ్యాట్స్‌మెన్ భార‌త బౌల‌ర్ల ధాటికి మైదానంలో నిల‌వ‌లేక‌పోయారు.  సమరవిక్రమ, పెరీరా, హెరాత్, గ్యామెజ్‌ ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే వెనుదిర‌గ‌గా, కరుణరత్నే 18, తిరిమన్నే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, ష‌న‌క 17, ల‌క్మ‌ల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చండిమ‌ల్ (61) చేసిన ఒంట‌రి పోరాటం వృథా అయింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భార‌త్ నిలిచింది.

  • Loading...

More Telugu News