Narendra Modi: 30 ర్యాలీలు, వందలాది కి.మీ. ప్రయాణం... పూజతో ప్రారంభించిన మోదీ!

  • వచ్చే నెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
  • సుడిగాలి పర్యటన ప్రారంభించిన మోదీ
  • రెండు వారాల్లో 30 సభల్లో మాట్లాడనున్న మోదీ

గుజరాత్ లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మలివిడత ప్రచారానికి బయలుదేరారు. రాష్ట్రమంతటా వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, 30కి పైగా ర్యాలీల్లో పాల్గొనే ఆయన, ఈ ఉదయం కచ్ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆశాపుర మాతా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, తొలి ర్యాలీని భుజ్ లో మొదలు పెట్టారు. సౌరాష్ట్రతో పాటు ముస్లింలు అధికంగా ఉండే దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

సౌరాష్ట్రలోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలనూ చుట్టి రానున్న ఆయన, దక్షిణ గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. కాంగ్రెస్ కు బలం అధికంగా ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో మోదీ పర్యటన అధికంగా సాగనుంది. వచ్చే రెండు వారాల వ్యవధిలో ఆయన దాదాపు 30 బహిరంగ సభల్లో మాట్లాడతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సౌరాష్ట్ర, ఆర్మెలి, సూరత్ ప్రాంతాల్లో నిర్ణయాత్మకమైన పటేల్ వర్గం ఓట్లు చెప్పుకోతగిన సంఖ్యలో ఉండటంతో, వారిపై మోదీ వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ ప్రసంగించే ప్రతి సభలో సమీపంలోని నాలుగైదు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా బీజేపీ స్థానిక నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మోదీ పర్యటిస్తున్న ప్రాంతాల్లో డిసెంబర్ 9న పోలింగ్ జరగనుంది.

Narendra Modi
Gujarath
assembly elections
  • Loading...

More Telugu News