blades: కడుపులో 263 నాణేలు, బ్లేడ్లు, మేకులు.... ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
- దాదాపు 5 కేజీల ఇనుప వస్తువులు
- సంజయ్‌గాంధీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
- కడుపునొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన మక్సూద్
అరుదైన శస్త్రచికిత్స ద్వారా వ్యక్తి కడుపులో నుంచి 263 నాణేలు, 12 షేవింగ్ బ్లేడ్లు, 4 పెద్ద మేకులను మధ్యప్రదేశ్ డాక్టర్లు బయటికి తీశారు. సత్నా జిల్లాలోని సోహవాల్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మహ్మద్ మక్సూద్ కడుపు నొప్పి వస్తోందంటూ నవంబర్ 18న సంజయ్‌గాంధీ మెడికల్ కాలేజీ, వైద్యశాలలో చేరాడు.
ఎక్స్ రేతో సహా ఇతర పరీక్షలు చేసి అతని కడుపులో ఇనుప వస్తువులు ఉన్న సంగతిని తేల్చినట్లు డాక్టర్ ప్రియాంక్ శర్మ తెలిపారు. తర్వాత మొత్తం ఆరుగురు వైద్యులు కలిసి శస్త్రచికిత్స ద్వారా నాణేలు, మేకులు, బ్లేడ్లు కలిపి ఏకమొత్తంగా దాదాపు 5 కేజీల ఇనుప వస్తువులను బయటికి తీసినట్లు ఆయన చెప్పారు. మక్సూద్‌కి మానసిక అనారోగ్యం వుందని, దీని కారణంగా రహస్యంగా బ్లేడ్లు, ఇనుప వస్తువులు మింగడంతో అవి కడుపులో పేరుకుపోయాయని, ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్లో ఉంచామని ప్రియాంక్ శర్మ తెలిపారు.