Chandrababu: ఇంకా చాలా మంది రెడీగా ఉన్నారు: చంద్రబాబు
- అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారు
- రాజకీయాలు నాకు ముఖ్యం కాదు
- నా పిలుపునకు వస్తున్న స్పందనే ఇది
- గిడ్డి ఈశ్వరిని టీడీపీలో చేర్చుకున్న తరువాత చంద్రబాబు
తన అభివృద్ధి కార్యక్రమాలను చూసి, తనకు సహకరించేందుకు మరింత మంది విపక్ష నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గిడ్డి ఈశ్వరిని పార్టీలోకి ఆహ్వానించిన తరువాత ఆయన మాట్లాడారు. అరకు కాఫీ తనకు మానసపుత్రిక వంటిదని చెప్పుకొచ్చిన ఆయన, గిరిపుత్రుల అభివృద్ధికి తాను అనునిత్యమూ శ్రమిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత, రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధికి సహకరించాలని పదేపదే పిలుపునిచ్చిన తనకు, మంచి స్పందన వచ్చిందని, తనతో దూరంగా ఉన్నవారు దగ్గరవుతున్నారని చెప్పారు. ఇది నూతన పరిణామమని, తనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.
విశాఖ జిల్లాలోని పాడేరు, అరకు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. అడవులను నమ్ముకుని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారి ఆరోగ్యం పట్ల ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. అన్ని ఇళ్లకూ 75 యూనిట్ల కరెంట్ ను ఉచితంగా ఇస్తున్నామని, సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. గిడ్డి ఈశ్వరితో పాటు పాడేరు నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక ప్రతినిధులు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. పాడేరు జడ్పీటీసీ సభ్యురాలు రత్నం, జీకే వీధి ఎంపీపీ ఎస్ బాలరాజు, పాడేరు ఎంపీపీ బొజ్జమ్మ తదితరులు ఈశ్వరితో పాటు టీడీపీ కండువా పుచ్చుకున్న ముఖ్య నేతల్లో ఉన్నారు.