jc diwakar reddy: నా మనసంతా వైసీపీ చుట్టే తిరుగుతుందేమో?: జేసీ నోటి వెంట కీలక వ్యాఖ్య

  • జగన్ లో కోరిక తప్ప విజన్ కనిపించడం లేదు
  • జగన్ గెలిస్తే సంతోషించే వాళ్లలో నేనుంటా
  • సభలకు వచ్చిన జనాల్లో ఓట్లేసే వాళ్లు చాలా తక్కువ
  • 2019లోగా పోలవరం పూర్తి కాదన్న జేసీ

"జగన్ మావాడంటే... వాడిని చిన్నప్పటి నుంచి చూశాను. వాడు నా ఫ్రెండ్ కొడుకు. వాళ్లు తిట్టుకుంటే తిట్టుకోనీయండి. నేను ఇంతే. నా మనసు వైసీపీలో ఉందని అందరూ అనుకుంటున్నా నాకేమీ ఇబ్బంది లేదు" అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబునాయుడితో పోటీ పడేవాడు జగన్ ఒక్కడేనని, అయితే జగన్ లో ఆ విజన్, స్ఫూర్తి, పట్టుదల కనిపించడం లేదని, కోరిక మాత్రమే కనిపిస్తోందని అన్నారు.

తాను రెడ్డిని కాదని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ఎవరైనా వచ్చి తన బ్లడ్ టెస్టు చేస్తానంటే ఓకేనని, తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. చిరంజీవి సభలకు ఎంతో మంది జనం వచ్చారని, వాళ్లు ఓట్లు మాత్రం వేయలేదని అన్నారు. ఓట్లు వేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారని అభిప్రాయపడ్డారు. తన మనసు కూడా వైసీపీ చుట్టూ తిరుగుతూ ఉందేమోనని అన్నారు.

తనను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎన్నడూ అనుకోలేదని వ్యాఖ్యానించిన జేసీ, నువ్వు అక్కడికి వెళ్లు, ఇక్కడికి వెళ్లు, ఆ పని చేయ్యి, ఈ పని చెయ్యి అని ఎన్నడూ చెప్పలేదని ఆరోపించారు. జగన్ వర్గాన్ని ఢీకొట్టే శక్తి తనకు ఉందో, లేదోనన్న విషయమై చంద్రబాబుకు అవగాహన లేదని అన్నారు. తనను నమ్మడం, నమ్మకపోవడం చంద్రబాబు ఇష్టమని, తదుపరి ఎన్నికల్లో జగన్ గెలిస్తే తాను సంతోషిస్తానని చెప్పారు. జగన్ లో ఇప్పుడు ఉత్సాహం పెరిగిందని, ప్రజల్లో ఏ మేరకు ఉత్సాహాన్ని చూరగొంటాడో చూడాలని చెప్పారు.

తదుపరి ఎన్నికల్లో తన వారసులు ప్రవేశించేందుకూ అవకాశం ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2019లోగా పోలవరం పూర్తి అయ్యే అవకాశం లేదని, చిన్న నట్టు బోల్టు కావాల్సి వచ్చినా, నెల రోజులు ఆగాల్సిన పరిస్థితి ఉండటమే ఇందుకు కారణమని జేసీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు బీజేపీ సహకరిస్తోందని భావించవద్దని, వారు కూడా ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రాజెక్టు వద్ద కుప్పలు కుప్పలు డబ్బు పెట్టినా పనులు కావని అన్నారు.

తనకు మద్యం తాగే అలవాటు లేదని, సోప్, పౌడర్, సెంట్లు వాడనని, మరే ఇతర అలవాట్లు లేవని, పేకాట మాత్రం అప్పుడప్పుడూ ఆడుతానని జేసీ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు గురించిన దిగులు తనకు ఎన్నడూ లేదని, ప్రజాప్రతినిధిగా కొనసాగడమే తన లక్ష్యమని అన్నారు.

  • Loading...

More Telugu News