jc diwakar reddy: డబ్బులు కావద్దా?... పర్సంటేజీలు తీసుకోకుంటే ఎలా?: జేసీ

  • నా కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టర్లకు ఇస్తాను
  • వారి నుంచి మాత్రమే కాస్తంత కమిషన్ తీసుకుంటా
  • ఎంత ఖర్చు పెట్టానో అంత సంపాదించుకుంటే చాలు
  • సీఎం రమేష్ తో ఎలాంటి విభేదాలూ లేవన్న జేసీ

అనంతపురం జిల్లాలో కాంట్రాక్టులు పొందేవారు తమకు కప్పం కట్టాలని ఎన్నడూ షరతులు విధించలేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, తాను తీసుకున్న కాంట్రాక్టులను సబ్ కాంట్రాక్టులుగా ఇచ్చి, వారి నుంచి కొంత కమిషన్ ను తన కార్యకర్తల అవసరాల మేరకు తీసుకుంటానని, అందులో తప్పు లేదని చెప్పుకొచ్చారు. తనకు కూడా డబ్బులు అవసరమేనని అభిప్రాయపడ్డ ఆయన, రాజకీయ జీవితంలో తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో, అంతా సంపాదించుకుంటే చాలునన్నదే తన ఉద్దేశమని తెలిపారు.

 సబ్ కాంట్రాక్టర్ల నుంచి కూడా పర్సంటేజీలు తీసుకోకుంటే ఎలా? అని ప్రశ్నించారు. జిల్లాలో కాంట్రాక్టుల విషయంలో తనకు, సీఎం రమేష్ కు మధ్య ఎటువంటి విభేదాలూ లేవని తెలిపిన ఆయన, తాడిపత్రి, గుత్తి హైవే పనుల జాప్యం వెనుక తన ప్రమేయం లేదని, అంచనా వ్యయం కుదరకనే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని అన్నారు. తను ఎవరికీ అన్యాయాలు చేయలేదని, ఏవైనా తన నోటీసుకు రాకుండా పోయి ఉండవచ్చని జేసీ తెలిపారు.

అధికారపక్షంలో ఉంటూ, ప్రతిపక్ష నేతగా మాట్లాడటం తన నైజమని, ప్రజా శ్రేయస్సు కోసమే తాను గళమెత్తుతానని చెప్పారు. నరేంద్ర మోదీ 'స్వచ్ఛ భారత్' అన్న కార్యక్రమాన్ని పారంభించక పూర్వమే, తన సోదరుడు అనంతపురం మునిసిపాలిటీని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా నిలిపారని జేసీ గుర్తు చేశారు. కౌన్సిలర్లు కూడా కాలేని వాళ్లకు చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారని, తన తమ్ముడు అంతకన్నా తక్కువా? అని చంద్రబాబును తాను స్వయంగా అడిగానని చెప్పుకొచ్చారు. చేతగాని వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ఆయన్ను నిలదీసే అధికారం తనకు లేదని అన్నారు.

jc diwakar reddy
Telugudesam
Chandrababu
cm ramesh
  • Loading...

More Telugu News