Virat Kohli: కోహ్లీ రికార్డుల వేట.. లారా రికార్డు కూడా సమం అయిపోయింది!
- రికార్డుల మోత మోగిస్తున్న టీమిండియా కెప్టెన్
- కెప్టెన్ గా 5 డబుల్ సెంచరీలు
- ద్రావిడ్ తో సమం, గవాస్కర్ రికార్డ్ బ్రేక్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరడం లేదు. బౌలర్లను ఊచకోత కోయడమే లక్ష్యంగా బరిలోకి దిగే కోహ్లీకి పలు రికార్డులు దాసోహం అవుతున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఎన్నో మైలు రాళ్లు అందుకున్నాడు. సెంచరీ చేసిన వెంటనే కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ గా ఘనతను సాధించాడు. నిన్నటి సెంచరీతో కెప్టెన్ గా కోహ్లీ 12 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు ఈ రికార్డు సునీల్ గవాస్కర్ (11 సెంచరీలు) పేరిట ఉంది.
ఈ రికార్డుతో కోహ్లీ తృప్తి చెందలేదు. తన పరుగుల వేటను కొనసాగించి డబుల్ సెంచరీ చేశాడు. దీంతో, టెస్ట్ కెరీర్ లో ఐదు డబుల్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కెప్టెన్ గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా (5 డబుల్ సెంచరీలు) రికార్డును సమం చేశాడు. ఇక్కడ మరో ఘనత ఏమిటంటే... కోహ్లీ చేసిన ఈ ఐదు డబుల్ సెంచరీలు కెప్టెన్ గా చేసినవే. దీనికి ముందు కెప్టెన్ హోదాలో పటౌడీ, ధోనీ, సచిన్, సునీల్ గవాస్కర్ లు కేవలం ఒక డబుల్ సెంచరీని మాత్రమే కొట్టారు. ఈ క్రమంలో ద్రావిడ్ రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు. ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాట్స్ మెన్ గా ద్రవిడ్ తో సమానంగా నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో సచిన్, సెహ్వాగ్ లు ఆరు డబుల్ సెంచరీలు (కెప్టెన్ గా, నాన్ కెప్టెన్ గా) చేశారు.
టెస్టుల్లో కెప్టెన్ గా అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్లు వీరే:
లారా (5), కోహ్లీ (5), స్మిత్ (4), బ్రాడ్ మన్ (4), క్లార్క్ (4).