marriage: మూడు రోజులు, 2 లక్షల పెళ్లిళ్లు, రూ. 20 వేల కోట్ల ఖర్చు!
- పెళ్లికి సగటు ఖర్చు రూ. 10 లక్షలు
- ఫంక్షన్ హాల్స్ దొరకక, అపార్టుమెంటు సెల్లార్లే దిక్కు
- కిటకిటలాడిన బస్సులు, రైళ్లు
- ధూమ్ ధామ్ గా సాగిన బడాబాబుల ఇంట వివాహాలు
గురువారం నుంచి శనివారం వరకూ... ఈ మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పెళ్లిళ్లు 2 లక్షలకు పైమాటే. మరో మూడు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరిగిపోయాయి. ఒక్కో పెళ్లికి సరాసరిన రూ. 10 లక్షలు ఖర్చవుతాయని అనుకున్నా సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చయినట్టు అంచనా. సగటున రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మూడు చొప్పున వివాహ ఆహ్వాన పత్రికలు అంది ఉంటాయని అంచనా.
అన్ని ప్రధాన నగరాల్లో కల్యాణ మండపాలను షిఫ్టుల వారీగా అద్దెలకు ఇవ్వడం గమనార్హం. ఇక ఫంక్షన్ హాల్స్ లభించని వారు రోడ్లపై, అపార్టుమెంట్ల సెల్లార్లలో వేదికలు నిర్మించేసుకుని, వివాహ పండగను ముగించేసుకున్నారు. బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో ఏ రైలుకు, బస్సుకు కూడా రిజర్వేషన్లు లభించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇక భోజనాల దగ్గర ఒక్కో పెళ్లి పెద్ద తన తాహతును బట్టి ప్లేటుకు రూ. 300 నుంచి రూ. 1800 వరకూ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఓ బడా పారిశ్రామికవేత్త కుమార్తె వివాహంలో రూ. 7 కోట్లు ఖర్చయి ఉంటుందని అంచనా. ఇక మరో కాంట్రాక్టరు పెళ్లిలో, ఒక ప్లేట్ భోజనానికి రూ. 7,500 వరకూ ఖర్చు పెట్టినట్టు సమాచారం. మరో పారిశ్రామికవేత్త ఇంట పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కు బాలీవుడ్ తారలను పిలిపించి రూ. 6 కోట్లు ఇచ్చి మరీ వారితో స్టెప్పులేయించినట్టు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ మూడు రోజుల పెళ్లిళ్ల హడావుడిలో చిత్రాలెన్నో!