cigarette: సిగరెట్ తాగడం మానేస్తే అదనపు సెలవులు.. ఉద్యోగులకు జపాన్ కంపెనీ బంపరాఫర్!
- ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టిన కంపెనీ
- ఏడాదికి అదనంగా ఆరు సెలవులు
- ఇదే బాటలో మరిన్ని కంపెనీలు
సాధారణంగా ఏ కంపెనీ అయినా తన లాభ నష్టాల గురించి చూసుకుంటుంది. ఉద్యోగుల యోగక్షేమాల గురించి పట్టించుకునే కంపెనీలు దాదాపు లేవనే చెప్పొచ్చు. అయితే జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమకు లాభనష్టాల కంటే సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని, దానికే తమ తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. అందులో భాగంగా ధూమపానం నుంచి బయటపడిన ఉద్యోగులకు ఏడాదికి అదనంగా ఆరు సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
టోక్యోలో పియాలా ఐఎన్‌సీ కంపెనీ కార్యాలయం 29వ అంతస్తులో ఉంది. కంపెనీ ఉద్యోగులు సిగరెట్ తాగేందుకు భవనం బేస్‌మెంట్‌లోకి వచ్చి వెళ్తుండడంతో 15 నిమిషాల సమయం వేస్టవుతోంది. సిగరెట్ తాగని ఓ ఉద్యోగి ఈ విషయాన్ని ఓ పేపర్‌పై రాసి సజెషన్ బాక్స్‌లో వేశాడు. అది చూసిన కంపెనీ సీఈవోకు ఓ ఆలోచన వచ్చింది.
పొగతాగని వారికి ఏడాదికి ఆరు పనిదినాలు సెలవులుగా ఇవ్వాలని నిర్ణయించాడు. ఫలితంగా ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని భావించాడు. అనుకున్నదే తడవుగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. సెప్టెంబరు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి రాగా 120 మంది ఉద్యోగుల్లో 30 మంది ఇప్పటికే ధూమపానానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడీ కంపెనీ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకునేందుకు పలు కంపెనీలు ముందుకు రావడం విశేషం.