tet exam: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. 10 జిల్లాల ఆధారంగానే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఆదేశం!
- 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్
- కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేదంటూ పిటిషన్
- పాత 10 జిల్లాల ఆధారంగానే నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనంటూ ఈ రోజు హైకోర్టు స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని... కొత్త జిల్లాలకు ఆమోదం లేదని వీరి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని కోర్టుకు తెలిపారు. కొత్త జిల్లాల వల్ల పాత జిల్లాలలో స్థానికేతరులుగా అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.