iit madras: మద్రాస్ ఐఐటీయన్లను సొంతం చేసుకునేందుకు క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు
- డిసెంబర్ 1 నుంచి క్యాంపస్ రిక్రూట్ మెంట్
- పాల్గొనేందుకు ఇప్పటికే 270 కంపెనీల ఆసక్తి
- జాబితాలో యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి దిగ్గజాలు
యాపిల్, యూబీఎస్ ఏజీ, నాస్ డాక్ (స్టాక్ ఎక్సేంజ్), యూఐడీఏఐ.. ఇవే కాదు, మరెన్నో కంపెనీలు ఇప్పుడు మద్రాస్ ఐఐటీ కేంద్రానికి ప్రయాణం అవుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి చెన్నైలో జరగనున్న నియామకాల ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ఇవన్నీ కూడా మొదటి సారి ఐఐటీ మద్రాస్ కు వస్తున్నవి కావడం విశేషం. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ప్రతిభావంతులను భారీ ఆఫర్లతో సొంతం చేసుకునేందుకు ఇవి సిద్ధమయ్యాయి.
ఐఐటీలకు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. క్యాంపస్ ప్లేస్ మెంట్ లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 270 సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. 400 రకాల ఉద్యోగ బాధ్యతలకు అభ్యర్థులను వెతుక్కోనున్నాయి. వచ్చే నెల 1 నుంచి 10 వరకు మధ్యలో ఒక్క రోజు విరామం (5వ తేదీ)తో ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరగనుంది. ఇందులో పాల్గొనే కంపెనీల్లో మైక్రోసాఫ్ట్, శామ్ సంగ్, గోల్డ్ మ్యాన్ శాక్స్, స్లమ్ బర్గర్, మహింద్రా, ఇంటెల్, బజాజ్, సిటీ, ఎల్ అండ్ టీ తదితర ప్రముఖ కంపెనీలున్నాయి.