ISIS: 15 మంది సొంత ఉగ్రవాదుల తలలు తెగ్గోసిన ఐసిస్!
- అంతర్గత పోరులో 15 మంది తలలు నరికేసిన ఐసిస్
- ధ్రువీకరించిన నంగార్హర్ ప్రావిన్షియల్ గవర్నర్
- తాలిబన్-ఐసిస్ మధ్య పరసర్ప దాడులు ఇక్కడ సర్వసాధారణం
సిరియాపై పట్టుకోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరుకున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గురువారం 15 మంది సొంత ఫైటర్ల తలలు తెగ్గోసింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగార్హర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయమై ఇంతకుమించి వివరాలు బయటకు రాలేదు. ఉగ్రవాదుల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో వీరంతా బలైనట్టు ప్రావిన్షియల్ గవర్నర్ అతుల్లా ఖోగ్యాని తెలిపారు. అచిన్ జిల్లాలోని సుర్ఖ్ అబ్ బజార్‌లో ఈ ఘటన జరిగినట్టు వివరించారు.
ఈ ప్రాంతంలో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మధ్య సంబంధాలు ఏమంతగా బాగోలేవు. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగడం నంగార్హర్‌లో సాధారణ విషయం. ఉగ్రవాదులను ఏరివేసేందుకు అమెరికా చేస్తున్న వాయుదాడుల్లో ఈ రెండు గ్రూపులు టార్గెట్‌గా మారుతున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తిష్ట వేసినట్టు ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.