mike huges: 'సైంటిస్టులు చెబుతున్నది తప్పు... భూమి గుండ్రంగా లేదు.. త్వరలోనే నిరూపిస్తా' అంటున్న అమెరికన్!
- భూమి గుండ్రంగా లేదని చెబుతున్న మైక్ హ్యూజెస్
- నిరూపించేందుకు రాకెట్ తయారీ
- 500 మైళ్ల వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లి ఫోటోలు తీసి చూపిస్తాడట
భూమి గుండ్రంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇది శుద్ధ తప్పు అంటున్నాడు కాలిఫోర్నియాకు చెందిన మైక్ హ్యూజేస్ (61). ఈ విషయంలో శాస్త్రవేత్తలు అబద్ధం చెబుతున్నారని, వారు చెబుతున్నట్టు భూమి గుండ్రంగా లేదని, భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని బల్లగుద్దిమరీ చెబుతున్నాడు. దీనిని నిరూపించేందుకు 18 వందల అడుగుల ఎత్తైన రాకెట్ ను కూడా ఆయనే స్వయంగా తయారు చేశాడు. ఆ రాకెట్ తో గంటకు 500 మైళ్ల వేగంతో పైకి ఎగిరెళ్లి ఫోటోలు తీసి శాస్త్రవేత్తలు చెప్పిన విషయం తప్పని నిరూపిస్తానని అంటున్నాడు.
ఆయనకు 'రీసెర్చ్ ఫ్లాట్ ఎర్త్' అనే సంస్థ ఆర్థికసాయం చేస్తోంది. భూమి గుండ్రంగా లేదని మైక్ ఎప్పటికైనా నిరూపిస్తాడని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. దీనిపై మైక్ మాట్లాడుతూ, చావంటే తనకు భయం లేదని అన్నాడు. మూర్ఖులు మాత్రమే చావుకు భయపడతారన్నాడు. ఎవరూ చేయని అద్భుతాలు చేయడాన్ని ఇష్టపడతానన్న మైక్, తన నిర్ణయాన్ని అంతా విమర్శిస్తున్నారని, త్వరలోనే వారంతా తనను పొగిడేరోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.