India: పాకిస్థాన్ ఏ మాత్రం మారలేదని నిర్ధారణ అయింది!: భారత్
- గృహ నిర్బంధం నుంచి హఫీజ్ సయీద్ ను విడుదల చేయడంతో మండిపడ్డ భారత్
- నిషేధిత ఉగ్రవాదులు పాక్ లో స్వేచ్ఛగా విహరించగలుగుతున్నారు
- ఈ ఘటనతో ఉగ్రవాద నిర్మూలనపై పాక్ నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుంది
పాకిస్థాన్ ఏమాత్రం మారలేదని అర్థమైందని భారత్ మండిపడింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ, నిషేధిత ఉగ్రవాదులు సైతం స్వేచ్ఛగా విహరించగలిగేలా అక్కడి వాతావరణం ఉందని అన్నారు.
సయీద్ ను విడుదల చేయడంతో ఆ దేశం నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి స్వేచ్ఛగా విహరించగలుగుతున్నాడంటే.. ఉగ్రవాద నిర్మూలనపై ఆ దేశానికున్న నిబద్ధత ఏ పాటిదో అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.