padmavathi: మధ్యప్రదేశ్ పాఠశాల పుస్తకాల్లో రాణీ పద్మిని గురించిన పాఠాలు!
- వచ్చే ఏడాది నుంచి అమలు
- స్పష్టం చేసిన మధ్యప్రదేశ్ సీఎం
- పద్మావతి జీవిత చరిత్రను అందరికీ తెలిపేయత్నం
రాజ్‌పుత్ మహారాణి పద్మిని జీవిత చరిత్ర గురించి చెప్పే పాఠ్యాంశాలను వచ్చే ఏడాది నుంచి సిలబస్‌లో చేర్చనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ 'పద్మావతి' చిత్రంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
'పద్మావతి' చిత్రానికి నిరసన తెలియజేస్తూ ఉజ్జయినీలో రాజ్‌పుత్ కమ్యూనిటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - `మహారాణి పద్మావతి జీవితగాథ గురించి ప్రజలకు తెలియదు. అంత గొప్ప మహారాణి చరిత్రను యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి బోధించాల్సిన బాధ్యత మన మీద ఉంది` అని అన్నారు.
ఇప్పటి వరకు చిత్తోర్‌గఢ్ ముట్టడి అనే పాఠ్యాంశంలో పద్మావతి అందానికి ముగ్ధుడై అల్లాఉద్దీన్ ఖిల్జీ యుద్ధానికి వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పద్మావతి ధైర్యసాహసాలను వర్ణిస్తూ ప్రత్యేక పాఠ్యాంశాన్ని జోడించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పద్మావతి విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా, ఆమె జ్ఞాపకార్థం ఓ అవార్డును కూడా నెలకొల్పుతామని గతంలో ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.