Yuvraj Singh: యువరాజ్ సింగ్ పై బీసీసీఐ పెద్దల విస్మయం
- రంజీకి డుమ్మా కొట్టి ఎన్సీఏలో ప్రత్యక్షమైన యువీ
- ఫిట్ నెస్ శిక్షణ తీసుకుంటున్న డ్యాషింగ్ బ్యాట్స్ మెన్
- జట్టులోకి పునరాగమనమే లక్ష్యం
టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన యువరాజ్ సింగ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ శిక్షణలో పాల్గొంటున్నాడు. ఈ అంశంపై బీసీసీఐలోని కొందరు పెద్దలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రంజీ మ్యాచ్ లకు డుమ్మాకొట్టి, ఎన్సీఏలో ఫిట్ నెస్ శిబిరంలో పాల్గొనడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ రంజీ సీజన్ పంజాబ్ తరపును ఆడిన యువరాజ్ కేవలం ఒక మ్యాచ్ లోనే పాల్గొన్నాడు. ఆ మ్యాచ్ లో 20, 42 పరుగులు చేశాడు. యువీకి ఎలాంటి గాయాలు లేకపోయినా, ఫిట్ నెస్ శిక్షణలో పాల్గొంటుండటాన్ని బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి ప్రశ్నించారు. ఎన్సీఏలో యువీకి ఏం పనో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఫిట్ నెస్ కు సంబంధించిన యోయో టెస్టులో యువీ ఫెయిల్ కావడంతో... జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో, యోయో టెస్టును పాస్ కావాలనే ఆలోచనతో ఫిట్ నెస్ శిక్షణలో పాల్గొంటున్నాడు. గాయాలు లేకపోయినా ఫిట్ నెస్ శిబిరంలో పాల్గొంటుండటంతో... యువీపై విమర్శలు వస్తున్నాయి.