varun dhavan: వరుణ్ ధావన్‌ను హెచ్చరించిన పోలీసులు.. క్షమాపణలు చెప్పిన బాలీవుడ్ హీరో!
- ముంబయి రోడ్డుపై ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వరుణ్ ధావన్
- కారులోంచే ఓ అభిమానితో సెల్ఫీ తీసుకున్న వైనం
- సినిమాల్లో అలాంటివి చేసుకోమంటూ పోలీసుల ట్వీట్
- మరోసారి ఇటువంటి పని చెయ్యబోనని వినమ్రతతో సారీ చెప్పిన నటుడు
రహదారిపై ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉండగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేసిన పని ముంబయి పోలీసులకు కోపం తెప్పించింది. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వరుణ్ ధావన్‌ను ఆటోలో వెళుతోన్న ఓ మహిళ చూసి సెల్ఫీ తీసుకుంటానని అడిగింది. దీంతో వరుణ్ ధావన్ ఆ మహిళతో స్వయంగా సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటో పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో స్పందించిన ముంబయి పోలీసులు ఆ ఫొటోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇటువంటి సాహసాలు సినిమాల్లో చేస్తే ఫర్వాలేదుగానీ, ముంబయి రహదారులపై చేయటం భావ్యం కాదని క్లాస్ పీకారు.
'ఇటువంటి చర్య నీ లైఫ్‌నే కాదు.. మరికొందరి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేసేలా ఉంది' అని అన్నారు. బాధ్యత గత ముంబయి పౌరుడిగా, యూత్ ఐకాన్‌గా వరుణ్ ధావన్ నుంచి తాము ఇలాంటిది కోరుకోవటం లేదని, ఇందుకు శిక్షగా ఆయనకు ఈ-ఛలాన్ పంపుతున్నామని పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి పని చేస్తే కఠిన శిక్షనే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన వరుణ్ ధావన్ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాను తన అభిమాని కోరికను కాదనలేకే ఇటువంటి పని చేశానని చెప్పాడు. ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటిస్తానని, మరోసారి ఇటువంటి పని చెయ్యబోనని వినమ్రతతో తెలిపాడు.