raj kandukuri: తరుణ్ భాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు .. ఆ మాటలు పట్టించుకోవద్దని భుజం తట్టాను: రాజ్ కందుకూరి
- ఓ డిస్ట్రిబ్యూటర్ కి 'పెళ్లి చూపులు' గురించి చెప్పాను
- టైటిల్ పాత చింతకాయ పచ్చడి అన్నాడు
- సినిమా చూడటానికి కూడా ఆసక్తిని చూపలేదు
'పెళ్లి చూపులు' సినిమాకి నిర్మాతగా వ్యవహరించి .. ఘన విజయాన్ని అందుకున్న రాజ్ కందుకూరి, ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఆ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. " ఈ సినిమా చేస్తోన్న సమయంలో ఎక్కడికి వెళ్లినా అంతా నిరుత్సాహ పరుస్తూ .. నమ్మకాన్ని దెబ్బతీస్తూ మాట్లాడేవారు"
"సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత .. ఒక డిస్ట్రిబ్యూటర్ కి తరుణ్ భాస్కర్ ను పరిచయం చేస్తూ .. 'పెళ్లి చూపులు' సినిమా గురించి చెప్పాను. 'అబ్బా .. టైటిల్ పాత చింతకాయ పచ్చడిలా వుంది. ఈ రోజుల్లో ఇలాంటి టైటిలా .. నేను సినిమా చూడను .. నేనే కాదు ఎవరూ చూడరు .. మీ డబ్బు .. సమయం రెండూ వృథా అయినట్టే' అన్నాడు. ఆ మాటలు విని తరుణ్ భాస్కర్ బయటికి వెళ్లిపోయాడు .. నేను ఆయన వెనకాలే వెళ్లాను. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించాడు. దాంతో 'ఆ మాటలు పట్టించుకోవద్దు .. మనం మంచి సినిమా చేశాం .. అందులో డౌటే లేదు' అంటూ భుజం తట్టాను" అని చెప్పుకొచ్చారు.