Donald Trump: గంటన్నర పాటు ట్రంప్-పుతిన్ ఫోన్ మంతనాలు
- సిరియాకు శాంతియుత పరిష్కారం కోసం పుతిన్ కు ఫోన్ చేసిన ట్రంప్
- సంక్షోభాలకు పరిష్కారాలు, ఉమ్మడిపోరుపై చర్చ
- జెనీవాలో జరిగే శాంతి చర్చలకు మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు సుమారు గంటన్నరసేపు ఫోన్ లో మాట్లాడుకోవడం ఆసక్తి రేపుతోంది. గతంలో అమెరికా అధ్యక్షులంతా రష్యాతో వైరాన్ని కొనసాగించారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రష్యాతో సానుకూల వైఖరి అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికి, శాంతి నెలకొల్పడంపై పుతిన్ తో గంటన్నరపాటు ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు.
సిరియా అధ్యక్షుడు బాషర్ అసద్ తాజాగా పుతిన్ ను కలిసిన అనంతరం వీరిద్దరూ ఫోన్ లో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సిరియా సమస్యలు, శాంతి స్థాపనపై చర్చించామని, జెనీవాలో జరిగే శాంతి చర్చలకు మద్దతు ప్రకటించామని ట్రంప్ వెల్లడించారు. అనంతరం పుతిన్ తో చర్చలపై వైట్ హౌస్ వివరణ ఇస్తూ, సిరియాలో ఉగ్రవాదులను ఏరివేసి, రాజకీయ సుస్థిరత నెలకొల్పడంతో పాటు, అంతర్యుద్ధం కారణంగా దేశం వదిలి వెళ్లిన సిరియన్లందరినీ వెనక్కి తేవడం వంటి అంశాలపై చర్చించారని తెలిపారు.
అలాగే ఈ చర్చలలో ఉత్తరకొరియా, ఉక్రెయిన్ సంక్షోభాలు, పశ్చిమాసియాలో ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలు, అల్-ఖైదా, ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లపై ఉమ్మడి పోరుపై చర్చించినట్టు తెలిపారు.