Tata: ఎయిర్‌టెల్‌కి మారిపోతున్న టాటా వినియోగదారులు.. ప్రారంభమైన ట్రాన్సిషన్!
- ఎయిర్‌టెల్‌లో విలీనమైన టాటా
- అధికారికంగా ప్రారంభమైన ట్రాన్సిషన్ ప్రక్రియ
- పాత ప్లాన్ల ప్రకారమే బిల్లులు చెల్లించవచ్చన్న ఎయిర్టెల్
భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలి సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్‌లు విలీనం అయిన నేపథ్యంలో టాటా వినియోగదారులను ఎయిర్‌టెల్‌లోకి మార్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐఈఆర్)లో భాగంగా వినియోగదారులను ఎయిర్‌టెల్‌లోకి మార్చుతున్నట్టు తెలిపింది.
ఉత్తరప్రదేశ్ (పశ్చిమ), బీహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలోని టాటా వినియోగదారుల ట్రాన్సిషన్ ప్రక్రియను ప్రారంభించినట్టు ఎయిర్టెల్ తెలిపింది. క్రమంగా టాటా టెలిసర్వీసులకు చెందిన మొత్తం ఖాతాదారులను ఎయిర్‌టెల్‌లోకి తీసుకొస్తామని భారతీ ఎయిర్టెల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అజయ్ పూరి తెలిపారు. టాటా వినియోగదారులను తమ సంస్థలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఎయిర్‌టెల్‌లో చేరే టాటా వినియోగదారులు నిరంతరంగా తమ సేవలను పొందవచ్చని, వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ల ప్రకారమే బిల్లులు చెల్లించవచ్చని అజయ్ వివరించారు.