isro: ఇస్రో ప్రస్థానంలో మరో ముందడుగు... మూడు రోజుల్లో లాంచ్ వెహికిల్ తయారీకి ప్రణాళిక
- ఖర్చు కూడా తక్కువే
- వెల్లడించిన వీఎస్ఎస్‌సీ డైరెక్టర్ డా. కె. శివన్
- 500 నుంచి 700 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం
అంతరిక్ష ప్రయోగాల్లో ఎప్పటికప్పుడు తమదైన ముద్రను వేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్న లాంచ్ వాహనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. వీటి తయారీ కేవలం మూడు రోజుల్లోనే పూర్తవుతుందని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం డైరెక్టర్ డా. కె. శివన్ అంటున్నారు.
ఇటీవల ఓ సెమినార్‌లో భాగంగా మాట్లాడిన ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 'చిన్న లాంచ్ వాహనాలను రూపొందించడంలో ఇస్రో బిజీగా ఉంది. 2018 - 2019 మధ్య వీటి తయారీ పూర్తికానుంది. వీటి తయారీ ఖర్చు కూడా చాలా తక్కువ. పీఎస్ఎల్వీతో పోల్చితే వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు పదో వంతు మాత్రమే. బరువు 100 టన్నులు అయినప్పటికీ 500 నుంచి 700 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంటుంది' అని శివన్ వెల్లడించారు.
అలాగే సాధారణ పరిమాణంలో ఉండే ఒక పీఎస్‌ఎల్వీ రాకెట్ తయారీ ఖర్చుతో చాలా మినీ పీఎస్‌ఎల్వీలను రూపొందించవచ్చని, దీంతో ఉపగ్రహాలను పంపే ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.