bhrahmos: ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ మిస్సైల్ బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం!
- రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా మరో చారిత్రక అడుగు
- తొలిసారి సుఖోయ్ యుద్ధవిమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం
- రక్షణ రంగంలో తిరుగులేని పురోగతి
- గగనతలం నుంచి కూడా ఈ క్షిపణిని ప్రయోగించి దాడి చేసే వీలు
భారత దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా మరో చారిత్రక అడుగు పడింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ మిస్సైల్ బ్రహ్మోస్ విజయవంతమైంది. ఈ పరీక్షను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ సుఖోయ్-30ఎంకేఐ నుంచి మొదటిసారిగా పరీక్షించారు. ఈ క్షిపణి బంగాళా ఖాతంలోని లక్ష్యాన్ని సులువుగా ఛేదించడంతో పరీక్ష విజయవంతమైందని ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
గతంలో ఈ పరీక్షను ఉపరితలం, యుద్ధనౌకల నుంచి పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా చేసిన పరీక్షతో బ్రహ్మోస్‌ను ఉపరితలం, సముద్రం, గగనతలం నుంచి పరీక్షించినట్లయింది. ఇక నుంచి గగనతలం నుంచి కూడా ఈ క్షిపణిని ప్రయోగించి దాడి చేసే వీలుంది. బ్రహ్మోస్ రాకతో భారత వైమానిక దళం మరింత బలవంతమైంది.
బ్రహ్మోస్ 300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా తాకగలదు. భారత్‌పై కుట్రలు పన్నుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్థాన్, చైనాల్లోని లక్ష్యాలపై దాడి చేయడం ఇకపై మన దేశ ఎయిర్ ఫోర్స్‌కు తేలిక అవుతుంది. దీంతో రక్షణ రంగంలో తిరుగులేని పురోగతి సాధించిన దేశంగా భారత్ నిలిచింది.