sun: సూర్యుడిపై ఇస్రో కన్ను... 2019లో ఇస్రో సోలార్ మిషన్!
- ఆదిత్య ఎల్1 పేరుతో సూర్యుడి మీద పరిశోధన
- వెల్లడించిన ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్
- సూర్యుని గతిజ స్థితులను అధ్యయనం చేయనున్న ఇస్రో
చంద్రుడు, అంగారక గ్రహాల అధ్యయనాల తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దృష్టి సూర్యుడి మీద పడింది. 2019లో ఆదిత్య ఎల్1 పేరుతో సూర్యుని గతిజ స్థితులను అధ్యయనం చేసేందుకు ఓ మిషన్ ప్రారంభించబోతున్నట్లు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొన్నారు.
సోలార్ ఫిజిక్స్ అభివృద్ధిలో భాగంగా సూర్యుని ఉష్ణ శక్తిని, ఆల్ట్రా వయొలేట్ రేస్ (అతి నీల లోహిత కిరణాలు) ను సమీపం నుంచి అధ్యయనం చేయనున్నట్టు ఇస్రోకు చెందిన మరో అధికారి తెలిపారు. ఈ అధ్యయనం వల్ల సూర్యునిలో శక్తికి కారణాలను తెలుసుకోవచ్చని అన్నారు. పీఎస్ఎల్వీ-40 లాంచ్ వెహికిల్ ద్వారా ఆరు పేలోడ్లను సూర్యుడు - భూమి మధ్యలో ఉన్న లాంగ్రేంజియన్ పాయింట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పాయింట్ నుంచి సూర్యుడ్ని నిరంతరం పర్యవేక్షించే వీలు కలుగుతుంది. అలాగే చంద్రుడి మీదకి పంపనున్న చంద్రయాన్ 2 మిషన్ మార్చి 2018లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.