miss world: మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గురించిన కొన్ని ముఖ్య విషయాలు.. ఫొటోలు!
- టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిన మానుషి
- ఏళ్ల తర్వాత భారత్‌కి కీరీటాన్ని తీసుకువచ్చిన హర్యానా సుందరి
- ఎంబీబీఎస్ చదువుతున్న ప్రపంచ సుందరి
మానుషి చిల్లర్... ఇప్పుడు ఈ పేరు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. ఎలాంటి ప్రచారం లేకుండా మిస్ వరల్డ్ కిరీటం గెలిచి రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె గురించి తెలుసుకోవడానికి జనాలు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎప్పుడు జన్మించింది? ఏం చదివింది? వాళ్ల కుటుంబం గురించిన వివరాలను ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫొటోలు మీకోసం...
మానుషి చిల్లర్ హర్యానాలోని రోహ్‌తక్‌లో 1997, మే 14న జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్ మిత్ర బసు చిల్లర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో శాస్త్రవేత్త. తల్లి డాక్టర్ నీలమ్ చిల్లర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ ఆలీడ్ సైన్సెస్‌లో న్యూరో కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మానుషికి ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. న్యూఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్‌లో ఆమె చదువుకుంది. 12వ తరగతి పరీక్షల్లో 96 శాతం మార్కులతో మానుషి పాసైంది. లెజండరీ డ్యాన్సర్లు రాజా, రాధా రెడ్డి, కౌసల్యా రెడ్డిల దగ్గర మానుషి కూచిపూడిలో శిక్షణ పొందింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కూడా ఆమె చదువుకుంది.
ఫ్యాషన్, మోడలింగ్ మాత్రమే కాకుండా మానుషికి కవిత్వం, చిత్రలేఖనంలోనూ ప్రావీణ్యం ఉంది. 2014లో జపాన్‌లో జరిగిన కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో మానుషి భారత్ తరఫున పాల్గొంది. ప్రస్తుతం సోనెపట్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మానుషి ఎంబీబీఎస్ చేస్తోంది. కార్డియాక్ సర్జన్ అవ్వాలనేది ఆమె లక్ష్యం. గతేడాది డిసెంబర్‌లో 'మిస్ క్యాంపస్ ప్రిన్సెస్'గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 'మిస్ హర్యానా'గా, జూన్‌లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ ఫొటోజెనిక్'గా మానుషి ఎంపికైంది.