wifi dabba: డేటా రేట్లను మరింత తగ్గించిన స్టార్టప్ సంస్థ... రూ. 2కే 100 ఎంబీ డేటా!
- వైఫై డబ్బా పేరుతో బెంగళూరులో సేవలు
- త్వరలో ఇతర నగరాలకు విస్తరణ
- 1 జీబీ డేటా రూ. 20 మాత్రమే
ఫ్రీ డేటాలు, టారిఫ్‌లు, ఆఫర్లు ఎన్ని వచ్చినప్పటికీ ఇతర దేశాల్లో పోల్చితే డేటా ధరలు భారత్‌లో అధికమే అనొచ్చు. జియో వచ్చిన తర్వాత డేటా ధరలు కొంత అందుబాటులోకి వచ్చినప్పటికీ కొన్ని షరతుల కారణంగా ఎక్కువ రేటు పెట్టక తప్పడం లేదు. ఈ సమస్య నుంచి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బెంగళూరుకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ కొంత ఊరట కల్పిస్తోంది. ఈ సంస్థ పేరు `వైఫై డబ్బా`. 13 నెలల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ కేవలం రూ.2కే 100 ఎంబీ డేటాను అందిస్తోంది.
దీంతో పాటు రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1జీబీ చొప్పున టారిఫ్‌లు కూడా నడుపుతోంది. 24 గంటల వ్యాలిడిటీతో ఈ ఆఫర్లు అందిస్తోంది. దీన్ని వినియోగించుకోవడం కోసం ఎలాంటి యాప్‌లు, లాగిన్‌లు అక్కర్లేదు. ప్రీపెయిడ్ టోకెన్ల ద్వారా వీరి సేవలను వినియోగించుకోవచ్చు. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా మొబైల్ నంబర్‌ను సరిపోల్చుకుని తర్వాత డేటాను ఇస్తుంది. నెట్‌వర్క్ కోసం ఆయా ప్రాంతాల్లో రూటర్లు ఏర్పాటు చేసింది. త్వరలోనే ఈ సేవను ఇతర మెట్రో నగరాలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.