sabarimala: అయ్యప్ప జోలపాట 'హరివరాసనం'లో మార్పు చేయనున్న ట్రావెన్ కోర్ దేవస్థానం
- శబరిగిరుల్లో వెలసిన అయ్యప్ప స్వామి
- అష్టకంలోని సంస్కృత పదాల రూపాంతరం
- 'అరివిమర్దనం' ను విడివిడిగా పలకాలి
- త్వరలోనే కొత్త శ్లోకాల రికార్డు: టీబీడీ
పంబానది తీరాన, శబరిగిరుల్లో వెలసి కోట్లాది మంది కొంగుబంగారమైన అయ్యప్ప స్వామిని నిద్రపుచ్చుతూ పాడే జోలపాట 'హరివరాసనం నిత్యమోహనం' అష్టకంలో ఉన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దినట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) నిర్ణయించింది. ఈ శ్లోకాల్లోని కొన్ని సంస్కృత పదాలు రూపాంతరం చెందాయని, మరికొన్ని అసలుకే లేవని పేర్కొన్న టీబీడీ, ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేజే ఏసుదాస్ రాగానే, సరిదిద్దిన 'హరివరాసనం' రికార్డు చేస్తామని అన్నారు.
ఈ అష్టకంలోని 'అరివిమర్దనం... నిత్యనర్తనం' అన్న వాక్యంలో 'అరి' అంటే శత్రువని, 'మర్దనం' అంటే నాశనం చేయడమన్న అర్థం వస్తుందని, ప్రస్తుతం ఈ రెండు పదాలనూ కలిపి పలుకుతుండగా, మారిన శ్లోకంలో రెండు విడివిడి పదాలుగా ఉంటాయని పేర్కొంది. కాగా, 'హరివరాసనం' శ్లోకాలను ఎందరో గాయకులు ఆలపించినప్పటికీ, ఏసుదాస్ గానం చేసిన శ్లోకాలే, అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్న సంగతి తెలిసిందే.