ashwani dutt: ఏపీ సర్కారు కొంత తప్పు చేసింది: అశ్వనీదత్
- మూడేళ్ల అవార్డులూ ఒకేసారి ఇవ్వకుండా ఉండాల్సింది
- అవార్డులే ఇవ్వని కాంగ్రెస్ ను ఎవరూ అనడం లేదు
- జ్యూరీ సభ్యుల ఎంపికలో చిన్న తప్పులు జరిగాయి
- 'మనం'కు అవార్డు ఇచ్చుంటే బాగుండేదన్న అశ్వనీదత్
మూడు సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను ఒకేసారి ప్రకటించడంతోనే వివాదం ఏర్పడిందని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. నంది అవార్డులపై వివాదం చెలరేగిన నేపథ్యంలో స్పందించిన ఆయన, అసలు అవార్డులే ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదని వ్యాఖ్యానించారు.
జ్యూరీ సభ్యుల ఎంపికలో ప్రభుత్వం చిన్న తప్పులు చేసిందని, వారిని ఎంపిక చేసే ముందు ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రం 'మనం'కు అవార్డు ఇచ్చివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇకపై క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరమూ అవార్డులు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.