Tom Moody: మూడీస్ రేటింగ్‌తో ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కష్టాలు.. సీపీఎం ఘోర తప్పిదం!
- మోదీ ప్రభుత్వానికి మూడీ రేటింగ్
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీనే రేటింగ్ ఇచ్చాడని భ్రమపడిన సీపీఎం
- ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు
- తలపట్టుకుంటున్న మూడీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేయడం ఏమో గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీకి కష్టాలు వచ్చిపడ్డాయి. సీపీఎం ఆధ్వర్యంలోని ‘సైబర్ ఆర్మీ’ అత్యుత్సాహంతో టామ్ మూడీ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. మూడీస్ రేటింగ్‌తో మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. సందు దొరికితే మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడే సీపీఎం దీనిపైనా విమర్శలు గుప్పించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ అయిన టామ్ మూడీనే రేటింగ్ ఇచ్చారని పొరపాటు పడిన ‘సైబర్ ఆర్మీ’ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ పిచ్చి రాతలు రాసింది.
‘‘మోదీ దగ్గర బాగా కమీషన్లు దండుకుని మంచి రేటింగ్ ఇచ్చారని మేం (కమ్యూనిస్టు పార్టీ) భావిస్తున్నాం. మూడీ షేమ్ షేమ్’’ అని రాసుకొచ్చారు. ‘‘2019లో మోదీ మట్టి కరవడం ఖాయం. అది మీరు చూస్తారు.. యూ..... మూడీ’’ అని తిట్ల దండకం అందుకున్నారు. దీనికి స్పందించిన లాల్ సలామ్ అనే వ్యక్తి కామెంట్ రాస్తూ.. అసభ్య రాతలు మానుకోవాలని, మూడీ అమాయకుడని, ఆయనెప్పుడూ మోదీ ప్రభుత్వానికి రేటింగ్ ఇవ్వలేదని రాశారు. తనకు సంబంధం లేకున్నా తనపై విరుచుకుపడుతుండంతో టామ్ మూడీ తలపట్టుకుంటున్నాడు.