southafrika: అసలు సిసలైన పరుగుల సునామీ... వన్డేల్లో 27 ఫోర్లు, 57 సిక్సులతో 490 పరుగులు సాధించిన సౌతాఫ్రికా ఆటగాడు!
- నమ్మశక్యం కాని స్కోరును సాధించిన షేన్ డాడ్స్ వెల్
- 151 బంతుల్లో 490 పరుగులు
- క్లబ్ లెవల్ మ్యాచ్ లో ఆల్ టైమ్ రికార్డు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది నిజంగా నమ్మలేని నిజం. ఒక రోజు అంతర్జాతీయ పోటీల్లో 250 పరుగులకు పైగా స్కోరు సాధిస్తే, విజయానికి బాటలు వేసుకున్నట్టే. మన రోహిత్ శర్మ ఒక మ్యాచ్ లో 264 పరుగులు చేస్తే, అబ్బురపడి చూశాం. కానీ, అసలు సిసలైన పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించాడో దక్షిణాఫ్రికా ప్లేయర్.
క్లబ్ లెవల్ ప్లేయర్ అయిన 20 సంవత్సరాల షేన్ డాడ్స్ వెల్, ఎన్ డబ్ల్యూయు క్లబ్ తరఫున ఆడుతూ, పోర్చ్ డార్ప్ ఫస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించాడు. శనివారం నాడు పుట్టిన రోజు జరుపుకున్న డాడ్స్ వెల్, 151 బంతులను ఎదుర్కొని, 27 ఫోర్లు, 57 సిక్సులతో 490 పరుగులు సాధించాడు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 677 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ లో 387 పరుగుల భారీ తేడాతో ఎన్ డబ్ల్యూయూ జట్టు విజయం సాధించింది.