Virat Kohli: తొలి టెస్ట్‌లో బౌలింగ్ చేసిన కోహ్లీ.. ఆసక్తిగా చూసిన ప్రేక్షకులు!
- కండరాలు పట్టేడయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న షమీ
- బంతి అందుకుని పూర్తి చేసిన కోహ్లీ
- ఆసక్తిగా చూసిన క్రికెటర్లు, ప్రేక్షకులు
భారత్-శ్రీలంక మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్ ఆలౌట్ అయిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 45వ ఓవర్ వేస్తున్న భారత పేసర్ మహమ్మద్ షమీ ఓవర్‌ను పూర్తి చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ఐదు బంతులు వేసి ఆరో బంతి వేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేశాయి. నడవడం కూడా ఇబ్బందిగా మారడంతో విషయాన్ని అంపైర్, కెప్టెన్ కోహ్లీ దృష్టికి తీసుకెళ్లి మైదానాన్ని వీడాడు.
దీంతో ఆ ఓవర్‌ను పూర్తిచేసే బాధ్యతను కోహ్లీ తీసుకుని బంతిని అందుకున్నాడు. మిగిలిన ఆ ఒక్క బంతిని వేసి ఓవర్ పూర్తిచేశాడు. బంతిని ఎదుర్కొన్న డిక్వెల్లా డిఫెన్స్ ఆడాడు. కాగా, మూడో రోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిరోషన్ డిక్వెల్లా 14, దినేశన్ చండీమాల్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌట్ అయింది.