india: మోదీ నయా ప్లాన్... ఒకరికి ఒకటే బ్యాంకు ఖాతా!
- బ్యాంకింగ్ రంగంలో పెను సంస్కరణ
- తొలి దశలో అదే బ్యాంకులోని ఇతర ఖాతాల రద్దు
- రెండో దశలో వేరే బ్యాంకుల్లోని ఖాతాలు
- ఇప్పటికే పని మొదలు పెట్టిన బ్యాంకులు
బ్యాంకింగ్ రంగంలో మరో పెను సంస్కరణ రానుంది. ఇప్పటికే అకౌంట్ పోర్టబిలిటీని తెచ్చే ఆలోచన చేస్తున్న కేంద్రం, ఈ రంగంలో మరింత పారదర్శకత దిశగా, ఒకరికి ఒక ఖాతా మాత్రమే ఉండేలా చూడాలని యోచిస్తోంది. తొలి దశలో ఒక వ్యక్తి పేరిట ఒకే బ్యాంకులోని ఇతర ఖాతాలు రద్దు చేసి, రెండో దశలో ఇతర బ్యాంకుల ఖాతాలు కూడా రద్దు చేయాలన్నది నరేంద్ర మోదీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఒక బ్యాంక్ లోని వేర్వేరు శాఖల్లో ఒకటికన్నా ఎక్కువ ఖాతాలుంటే అందులో ఒకదాన్నే కొనసాగించి, మిగతావాటిని రద్దు చేసే ప్రక్రియ కొన్ని బ్యాంకుల్లో మొదలైంది కూడా. ఇక బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తయ్యాక ఇది మరింత వేగవంతమవుతుందని అధికారులే చెబుతున్నారు.
సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో ఒకటికన్నా ఎక్కువ ఖాతాలను నడిపిస్తున్నవారే సహజం. ఉదాహరణకు, ఓ ఉద్యోగి వేతన ఖాతా ఒకటి అయితే, సేవలు బాగున్నాయని మరో బ్యాంకులో, డీమ్యాట్ లావాదేవీల కోసం ఇంకో బ్యాంకులో ఖాతాలను కలిగుండటం చాలా కామన్. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే వివిధ బ్యాంకులకు సంబంధించి ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్యాంకు శాఖలుండగా, వీటిల్లో సుమారు 8 కోట్లకు పైగా ఖాతాలున్నాయి. వీటిల్లో కనీసం 1.20 కోట్ల ఖాతాలు నకిలీవేనని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ చెబుతోంది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో బహుళ అకౌంట్లు నడిపిస్తున్న వారు అధికంగా ఉన్నారు. గడచిన 3 నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి బహుళ ఖాతాలున్నాయన్న కారణంగా లక్ష అకౌంట్లను తొలగించామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఇక 3 వేలకు పైగా శాఖలను, 2.4 కోట్ల ఖాతాలను నిర్వహిస్తున్న అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే, బహుళ ఖాతాలుంటే, వాటిని ఎలాంటి రుసుము చెల్లించకుండా రద్దు చేసుకోవాలని బ్యాంకే సూచిస్తోంది. కేవైసీ వివరాలు సమగ్రంగా ఉంటే, అదే బ్యాంకులోని ఏ ఇతర బ్రాంచీకైనా కూడా ఖాతాను సులభంగా మార్చుకోవచ్చని తెలుపుతోంది. అయితే, ఈ ఆలోచనను పటిష్ఠంగా అమలు చేయడం కూడా అంత సులువేమీ కాదన్నది బ్యాంకింగ్ రంగంలోని నిపుణుల అభిప్రాయం. బ్యాంకులు వినియోగించే సాఫ్ట్ వేర్ లను మార్చడంతో పాటు, బ్యాంకులన్నీ ఒకే డేటాబేస్ ను వాడాల్సివుంటుంది. బ్యాంకులు అమలు చేస్తున్న ఐఎఫ్ఎస్సీ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) మొబైల్ మనీ ఐడెంటిఫియర్ (ఎంఎంఐడీ)లను కూడా మార్చాలి. ఈ సవాళ్లను అధిగమించి బ్యాంకులు ఏక ఖాతా దిశగా ముందడుగు వేస్తే, అది బ్యాంకింగ్ రంగంలో పెను విప్లవానికి దారి తీసినట్టే.