Pawan Kalyan: ఏదైనా సాధించడానికి చాలా సహనం కావాలి.. ఇదేమీ సినిమా కాదు!: లండన్‌లో పవన్ కల్యాణ్
- లండన్‌లో విద్యార్థులతో సమావేశమైన పవన్ కల్యాణ్
- అప్పట్లో తమది వెనుకబడిన కులం అని చెప్పుకునేందుకు నామోషీగా భావించేవారు
- భారత్‌లో రిజర్వేషన్లు అవసరం లేని మార్పు ఇప్పటికే వచ్చేస్తే బాగుండేది
- దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించడం అతి ముఖ్యం
నిజ జీవితంలో ఏదైనా సాధించడానికి చాలా సహనం కావాలని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రెండు రోజుల లండన్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి తెలుగు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... నిజ జీవితం అంటే సినిమాల్లోలా ఉండదని, సినిమాల్లో వెంట వెంటనే ఏదైనా అయిపోతుందని వ్యాఖ్యానించారు.
కానీ నిజజీవితంలో అలా కాదని, చాలా సమయం పడుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. భారత్‌లో కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశంపై పవన్ మాట్లాడుతూ... రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వచ్చిన రిజర్వేషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అవి అవసరం లేని పరిస్థితి వస్తే బాగుండేదని అన్నారు. సమానత్వం వచ్చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ మార్పు వస్తోందని, అప్పట్లో వెనుకబడిన కులం అని చెప్పుకునేందుకు నామోషీగా భావించేవారని, కానీ ఇప్పుడు ఆ భావన తొలగిపోతోందని తెలిపారు.
భారత్‌లో ప్రజాస్వామ్యం ఉండడం ప్లస్ పాయింట్ అని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ, స్వేచ్ఛ ముసుగులో ఇష్టం వచ్చినట్లు పౌరులు ప్రవర్తించవద్దని అన్నారు. దేశం కోసం మన వైపు నుంచి మనం ఏం చేయగలమని ప్రశ్నించుకోవాలని అన్నారు. దేశంలో ఆడపిల్లలకు రక్షణ కల్పించడం అతి ముఖ్యమని తనకు అనిపిస్తుందని తెలిపారు. చివరకు జైహింద్ అంటూ పవన్ ముగించారు.