Canada: కెనడా ప్రధాని జస్టిన్ త్రెదో పేరుతో బీరు.. తయారు చేసిన ఉక్రెయిన్ కంపెనీ
- డొనాల్డ్ ట్రంప్, ఏంజెలా మెర్కల్ పేర్లతో కూడా
- వారి పాలనను గుర్తుకు తెచ్చే బీరు రుచి
- కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు, పాలనాధినేతలకు గుర్తింపు
ఉక్రెయిన్‌లోని లివివ్ నగరంలో ఉన్న బీర్ థియేటర్ సంస్థ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ త్రెదో పేరుతో ఓ బీరును తయారు చేసింది. ఈ బీరు లేబుల్ మీద అతని బొమ్మతో పాటు, కెనడా రక్షణ మంత్రి హర్జీత్ సింగ్ సజ్జన్, విదేశాంగ మంత్రి క్రిస్టినా అలెగ్జాండ్ర క్రిస్టియా (ఈమె ఉక్రెయిన్ జాతికి చెందిన మహిళ)ల బొమ్మలను కూడా చూడొచ్చు. అంతేకాకుండా త్రెదో తీసుకువచ్చిన ప్రముఖ సంస్కరణలైన ఎల్‌జీబీటీ హక్కులు, అతని వేషధారణ విధానాలను కూడా లేబుల్ మీద ప్రతిబింబింపజేసింది.
ఈ కంపెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్ పేర్లతో కూడా బీర్లు తయారు చేసింది. వాళ్ల పాలనలకు తగ్గట్లే బీరు రుచి కూడా ఉంటుందని వారి వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఉదాహరణకు మెక్సికోకు అడ్డంగా గోడ కట్టాలనుకుంటున్న ట్రంప్ భావజాలాన్ని గుర్తుచేసేలా ఆయన పేరు ఉన్న బీరు తాగితే హృదయం చుట్టూ గోడ కట్టినట్టు అనిపించే భావన కలుగుతుందట. ఏదేమైనా ఇలాంటి వినూత్న ప్రయోగం ద్వారా ఓ పక్క పాలనాధినేతలకు గుర్తింపునిస్తూ, కస్టమర్లను ఆకట్టుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే!