bengal: బెంగాల్ ప్రభుత్వం నా ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేస్తోంది: ముకుల్ రాయ్
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత
- వొడాఫోన్, ఎంటీఎన్ఎల్ సంస్థలను వివరణ అడిగిన హైకోర్టు
- నిజమని తేలితే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్
తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఇటీవల బీజేపీలో చేరిన పశ్చిమ బెంగాల్ నేత ముకుల్ రాయ్... రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆరోపణల్లో నిజాన్ని తేల్చాలని కోరుతూ వొడాఫోన్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ముకుల్ రాయ్ చేసిన కాల్స్‌ని గానీ, అతనికి వచ్చిన కాల్స్‌ని గానీ, లేదా అతని బంధువుల ఫోన్ కాల్స్ వివరాలను గానీ ట్యాప్ చేసినట్లు ఆధారాలు సమకూర్చాలని కోరింది.
దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి నవంబర్ 20కి వాయిదా వేశారు. ఇదిలా ఉంచితే, ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు ముకుల్ రాయ్ ఫిర్యాదు చేయడంతో... ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే బెంగాల్ ప్రభుత్వంపై సంబంధిత చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.