love jihad: లవ్ జిహాద్... మతం మారాలంటూ మోడల్ కు వేధింపులు!
- లవ్ జిహాద్ ను ఎదుర్కొన్న మాజీ మోడల్ రష్మీ
- మతం మారాలంటూ గత కొంతకాలంగా వేధింపులు
- కుమారుడ్ని తనకు కాకుండా చేసి, మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపణలు
ముంబై మాజీ మోడల్ ఒకరు లవ్ జిహాద్ వేధింపులకు గురైన సంఘటన తాజాగా వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే... 13 ఏళ్ల క్రితం ముంబైకి చెందిన రష్మీ (42) మోడలింగ్ లో రాణించే సమయంలో ముస్లిం మతానికి చెందిన ఆసిఫ్ (47) ను వివాహం చేసుకుంది. వివాహం సమయంలో ఎవరి మతాచారాలు వారివని, ఒకరి మతాచారాలకు మరొకరు అభ్యంతరం చెప్పకూడదన్న అంగీకారంతో వివాహం జరిగింది. అయితే, గత కొంత కాలంగా ముస్లిం మతాచారాలు ఆచరించాలంటూ భర్త ఆమెను ఒత్తిడి చేయడం ఆరంభించాడు.
దానిని తాను తిరస్కరించడంతో, మరో మహిళ (28)ను వివాహం చేసుకోవడమే కాకుండా, తన ఏడేళ్ల కుమారుడ్ని తనకు ఇవ్వకుండా, తన దగ్గరే ఉంచుకుని తనకు కాకుండా చేశారని ఆమె భర్తపై ఆరోపణలు చేసింది. ఇప్పుడు తన కుమారుడు తనను రాక్షసిని చూసినట్టు చూస్తున్నాడని ఆమె కన్నీరుమున్నీరైంది.
ఇప్పుడు తన భర్త వివాహం చేసుకున్న మహిళ తన సోదరుడి గర్ల్ ఫ్రెండేనని ఆమె తెలిపింది. తొలుత ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న తన భర్త, తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నాడని ఆరోపించింది. తన భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 354, 323, 324, 504, 506 మరియు 34ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.