moody's: 14 ఏళ్ల తరువాత తొలిసారిగా భారత రేటింగ్ ను అప్ గ్రేడ్ చేసిన మూడీస్!
- 'బీఏఏ3' రేటింగ్ ను 'బీఏఏ2'కు పెంచిన మూడీస్
- 2004 తరువాత పెరిగిన రేటింగ్
- స్టాక్ మార్కెట్లో లాభాల పంట
- ఇండియాలో క్రెడిట్ రిస్క్ సమతుల్యమన్న మూడీస్
ప్రముఖ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజన్సీ 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' 14 సంవత్సరాల తరువాత తొలిసారిగా భారత రేటింగ్ ను అప్ గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, భారత మార్కెట్ ను ఆకర్షణీయంగా మార్చాయని చెబుతూ, ప్రస్తుతమున్న 'బీఏఏ3' రేటింగ్ ను 'బీఏఏ2'కు పెంచుతున్నట్టు శుక్రవారం నాడు ప్రకటించింది. 'బీఏఏ2' స్థాయి అంటే, ఇండియాలో క్రెడిట్ రిస్క్ సమతుల్యంగా ఉందని అర్థం. భారత రేటింగ్ ను 2004 నుంచి మూడీస్ మార్చకపోవడం గమనార్హం.
రూపాయి బలపడటం, స్టాక్ మార్కెట్ పయనం, జీఎస్టీ అమలు, డీమానిటైజేషన్ తదితరాల కారణంగానే రేటింగ్ ను సవరిస్తున్నట్టు మూడీస్ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఫిలిప్పీన్స్, ఇటలీ తదితర దేశాలు 'బీఏఏ2' రేటింగ్ లో ఉండగా, వాటితో సమానంగా ఇండియా నిలిచింది. కాగా, ఈ రేటింగ్ మార్పు గతంలోనే జరిగుండాల్సిందని నరేంద్ర మోదీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ఇండియాలో ఎన్నో పెద్ద ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయని, మూడీస్ రేటింగ్ సవరణ వాటికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం సొంత సంస్కరణల అజెండాను అమలు చేస్తూ, ముందడుగు వేస్తోందని అన్నారు.
కాగా, మూడీస్ ప్రకటన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను అమాంతం పెంచింది. ఈ ఉదయం మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. మధ్యాహ్నం 12.45 గంటల సమయానికి సెన్సెక్స్ 336 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో నడుస్తోంది. పలు లార్జ్ క్యాప్ సెక్టార్ ఈక్విటీలు రెండు నుంచి మూడు శాతం లాభాల్లో సాగుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 65 స్థాయి నుంచి కిందకు వచ్చింది.