mem saab: మేమ్ సాబ్ కాదు... రక్ష మంత్రి అని పిలవండి...!: సైనికులకు సూచించిన నిర్మలా సీతారామన్
- మంత్రిని ఏమని పిలవాలో అర్థంకాక మదనపడిన సైనికులు
- మేమ్ సాబ్, సార్, మేడమ్ అని పిలిచిన సోల్జర్లు
- అలా వద్దని చెప్పిన రక్షణ మంత్రి
గత రెండు నెలలుగా భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులను, భద్రతాధికారులను కలుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ సైనికులు ఆమెను ఏమని సంబోధించాలో తెలియక ఇబ్బంది పడటం చూసి నిర్మలా సీతారామన్ స్వయంగా తనను 'రక్ష మంత్రి' అని పిలవండని చెప్పారట.
సైనికులతో ముచ్చటిస్తున్నపుడు వారంతా ఆమెను 'మేమ్ సాబ్, సార్, మేడమ్ అని పిలిచినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆమె స్వయంగా ప్రసంగిస్తున్నపుడు రక్ష మంత్రి అని పిలవాలని కోరినట్లు కొంతమంది సైనికులు చెప్పారు. సాధారణంగా ఆర్మీ ఆఫీసర్ భార్యను, సైనికులు 'మేమ్ సాబ్' అని పిలుస్తారు. రక్షణ మంత్రిగా మహిళ వారి వద్దకు వెళ్లడంతో ఏమని పిలవాలో అర్థంకాక అయోమయానికి గురయ్యారని, ఆమె 'రక్ష మంత్రి' అని పిలవమని చెప్పడంతో సైనికులకు కొంత ఊరట కలిగిందని సీనియర్ మిలటరీ అధికారి ఒకరు చెప్పారు.