bil tawil: ఉత్తరసూడాన్ లో జెండా పాతి... 'నేనే రాజు- నేనే మంత్రి' అంటున్న భారతీయుడు!
- సంచలనానికి తెరదీసిన భారతీయ సాహసికుడు సుయాష్ దీక్షిత్
- ఉత్తరఆఫ్రికాలోని ఈజిప్టు-సూడాన్ ల మధ్యనున్న బిర్ తావిల్ చేరిన వైనం
- ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి చెందని ప్రాంతం ఇది
- అక్కడ జెండా ఎగురేసి, విత్తనాలు చల్లిన సుయాష్
భారతీయ సాహసికుడు సుయాష్ దీక్షిత్ సంచలనానికి తెరదీశాడు. తనకంటూ ప్రత్యేకత ఉండాలని తపించే సుయాష్ దీక్షత్ కు కొత్త ప్రాంతాలను అన్వేషించడం హాబీ. భూమి మీద ఏ రాష్ట్రానికీ, ఏ దేశానికీ చెందని ప్రాంతం ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్టు-సుడాన్‌ల మధ్య ఉందని తెలుసుకుని మూడు పగళ్లు, రెండు రాత్రుళ్లు ప్రయాణించి బిల్ తావిల్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఈ ప్రాంతం ప్రస్తుతం ఈజిప్టు మిలటరీ అధీనంలో ఉంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు కూడా అమలులో ఉన్నాయి. ఆ రూట్ లో వెళ్లేందుకు అనుమతులు కూడా కావాలి. అక్కడ ఫోటోలు కూడా తీయకూడదు.
అలాంటి ప్రాంతంలోకి సుయాష్ దీక్షిత్ అడుగుపెట్టాడు. అంతే కాకుండా అక్కడ జెండా పాతాడు. దానికి ‘దీక్షిత్ కింగ్ డమ్’ అని నామకరణం చేేశాడు. ఈ కింగ్ డమ్ కు ’నేనే రాజు..నేనే మంత్రి’ అని సుయాష్ అంటున్నాడు. ఇక్కడ ఎవరికైనా పౌరసత్వం కావాలంటే తనను సంప్రదించాలని ఫేస్ బుక్ ద్వారా పిలుపునిచ్చాడు. దీని విస్తీర్ణం 800 చదరపు మైళ్లు. ఇక్కడ ఫోటోలు దిగిన దీక్షిత్ విత్తనాలు చల్లాడు. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే పంటలు పండాలని అన్నాడు. వెంటనే ఈ ప్రాంతం తనదేనని, వెంటనే ఐక్యరాజ్యసమితికి ఈమెయిల్ పంపాలని పేర్కొంటున్నాడు. తన రాజ్యాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతానని దీక్షిత్ తెలిపాడు.