Narendra Modi: వెంటాడుతున్న అవరోధాలు... ఇంకా ఓకే చెప్పని నరేంద్ర మోదీ... హైదరాబాద్ మెట్రో ప్రారంభం డౌటే!

  • ఇంకా లభించని సీఎంఆర్ఎస్ అనుమతులు
  • కనీసం ఆరు నెలలు ట్రయల్స్ వేస్తేనే అనుమతి
  • మెట్టుగూడ నుంచి ఎస్ఆర్ నగర్ వరకూ రెండు వారాల నుంచే ట్రయల్స్
  • మోదీ నిర్ణయమే కీలకం

జంటనగరాల వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాగోల్ నుంచి మెట్టుగూడకు, మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ వరకు మాత్రమే కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతులు రావడం, మధ్యలో కీలకమైన మెట్టుగూడ - ఎస్ఆర్ నగర్ మార్గానికి పచ్చజెండా రాకపోవడంతో ముందు అనుకున్నట్టుగా ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతుందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

పైగా ప్రారంభోత్సవానికి తాను వస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ కచ్చితంగా చెప్పలేదు. సీఎంఆర్ఎస్ అనుమతి ఇంకా రాలేదన్న విషయం మోదీకి తెలుసునని, అందుకే ఆయనింకా పచ్చజెండా ఊపలేదని తెలుస్తోంది. వాస్తవానికి మెట్రో రైల్ కు సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే, కనీసం ఆరు నెలల పాటు నిత్యమూ ట్రయల్ రన్స్ వేయాలి. మెట్టుగూడ నుంచి ఎస్ఆర్ నగర్ మధ్య రెండు వారాలుగా మాత్రమే ట్రయల్ రన్స్ నడుస్తున్నాయి.

ఈ విషయంలో తమకు 23వ తేదీ నాటికి అనుమతులు లభిస్తాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వ్యాఖ్యానించినా, అది జరిగేలా కనిపించడం లేదని కొందరు అధికారుల వాదన. ఇక నెలాఖరులో హైదరాబాద్ కు వచ్చి హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు ట్రంప్ కుమార్తె ఇవాంకతో కలిసి హాజరు కానున్న మోదీ, మియాపూర్ వరకూ వచ్చి మెట్రో రైలును ప్రారంభించకపోతారా? అన్న ధీమాలో తెలంగాణ సర్కారుంది. ఆయన కోసం మియాపూర్ లో హెలిపాడ్ సైతం సిద్ధమవుతోంది. ఒకవేళ ఆయన రాకుంటే, కనీసం హెచ్ఐసీసీ నుంచి రిమోట్ ద్వారానైనా రైలు సేవలను ప్రారంభించాలన్నది కేసీఆర్ సర్కారు ఆలోచనగా తెలుస్తోంది.

Narendra Modi
Hyderabad metro
KCR
  • Loading...

More Telugu News