telangana: కల్లు ఓ ఔషధమే.. అనారోగ్యం పోతుంది!: తెలంగాణ అసెంబ్లీలో ఎక్సైజ్ మంత్రి
- కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది
- కామెర్లను కూడా నయం చేస్తుంది
- నాణ్యమైన కల్లుతో ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయన్న మంత్రి
కల్లు కచ్చితంగా ఓ ఔషధమేనని, కిడ్నీలో రాళ్లను తొలగించడంతో పాటు కామెర్లను నయం చేస్తుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. అసెంబ్లీలో గీత కార్మికుల సంక్షేమంపై ప్రశ్నోత్తరాల సమయంలో స్వల్ప చర్చ జరిగిన వేళ, పద్మారావు సమాధానం ఇస్తూ, కీలక వ్యాఖ్యలు చేశారు. కల్లుగీత కార్మికులకు శాశ్వత లైసెన్సులు ఇస్తామని తెలిపారు. నాణ్యమైన కల్లు వాడకంతో అనారోగ్య ఇబ్బందులు దూరమవుతాయని తెలిపారు.
చనిపోయిన కార్మికులకు ఇస్తున్న పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మరిన్ని చెట్లను పెంచేందుకు రుణాలిస్తామని వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తాటి, ఈత చెట్లు లేనందునే కల్తీ కల్లు పెరిగిందని, తన తండ్రికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా, తన జాతికి సంబంధించిన అంశంపై చర్చ కావడంతో, రిజిస్టర్ లో సంతకం చేసి వచ్చానని అన్నారు.